శమంతపంచకం



బలరామకృష్ణులు ద్వారకలో సుఖంగా ఉన్న రోజులలో కల్పాంత కాలంలో వచ్చే చూడటానికి విలులేని విధంగా సూర్యగ్రహణం రానున్నదని తెలుసుకున్నారు. ప్రజలందరూ తమ వెంట రాగా వారు శమంతపంచకం అనే మహా పుణ్యక్షేత్రానికి వెళ్ళారు. ఆ క్షేత్రం ఎంత గొప్పదంటే, పరశురాముడు పరక్రమంతో అభిరాముడై ఇరవైఒక్క సార్లు దండెత్తి, వజ్రాయుధం లాంటి తన పరశువు(గోడలి) రాజలోకానీ దునుమాడాడు. లోకాన్ని నిఃక్షత్రియం చేసాడు. ఆసమయంలో ఆ రాజుల శరీరాలనుండి స్రవించిన రక్తం ప్రవాహం కడితే ఆ రక్తప్రవాహాన్ని పరశురాముడు ఐదుమడుగులు కావించాడు. అవి శమంతపంచకం అనే పేరుతో పవిత్రక్షేత్రంగా రూపొందాయి. అట్టి శమంతకానికి శ్రీబలరామకృష్ణాది యాదవులు గ్రహణ సందర్భంగా చేరుకున్నారు. బలరామకృష్ణులు లోకధర్మపాలనకు పూనుకుని, ప్రద్యుమ్నుడు, గదుడు, సాంబుడు, సుచంద్రుడు, శుకుడు, సారణుడు, అనిరుద్ధుడు, కృతవర్మ మున్నగు యాదవ మహాయోధులను నగర రక్షణ కోసం ద్వారకలో నిలిపారు. అక్రూరుడు, వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదువులుతో కలిసి, వారు సర్వాలంకారశోభితులై కాంతాసమేతంగా బయలుదేరారు. పుష్పక విమానాల వంటి రథాలు, మేఘాలను పోలు ఏనుగులు, మనోజవములైన అశ్వాలు వంటి, వారివారికి తగిన వాహనాలలో శమంత పంచకానికి ప్రయాణం అయ్యారు. దేవతలకు సాటి వచ్చే సేవకులు వారిని సేవిస్తుండగా ఆ పుణ్యక్షేత్రం చేరారు. ఆ పుణ్యతీర్ధాలలో స్నానాలు చేసి ఉపవాసాలు చేశారు. తరువాత గృహ, భూషణ, భూ, సువర్ణ, రత్న, గోదానాలు చేసారు. మఱియు, అనేక గొప్ప వస్తువులు మున్నగువాటిని సాటిలేని దానాలు, మనోజ్ఞంగా బ్రాహ్మణోత్తములకు ఇచ్చారు. దానాలు చేసాక, శమంతపంచకంలో మరల స్నానాలు చేసి, బలరామ కృష్ణులు బంధువులతో కలసి భోజనాలు చేసారు. వీరికంటే ముందుగా ఎందరో క్షత్రియ ప్రముఖులు మున్నగు వారు ఆ పుణ్యతీర్థాన్ని సేవించడానికి వచ్చి ఉన్నారు. ఆ మత్స్య, ఉశీనర, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆరట్ట, కేరళ మున్నగు సకల దేశాధీశ్వరులూ; శ్రేయోభిలాషులు; నందగోపాది గోపాలకులూ; ధర్మరాజుతో కలసివచ్చిన భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సతీ సమేతులైన పాండవులు; సంజయుడు, విదురుడు, కృపాచార్యులు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు, ద్రుపదుడు, శైబ్యుడు, ధృష్టకేతుడు, కాశిరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, యుధామన్యువు, సుశర్మలును; పుత్రసమేతంగా వచ్చిన బాహ్లికుడు; మొదలైన వారందరూ ఉగ్రసేనాది యాదవ ముఖ్యులచే పూజలందుకున్నారు. అందుకు వారంతా ఎంతో సంతోషించారు. ఆ రాజులు అందరూ సతీసమేతంగా వచ్చి, ప్రియకాంతా పరివారాలతో కూడి ఉన్న శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నారు. ఈ శ్రీకృష్ణుడు సామాన్యుడు కాడు. తెలియండి. మన శాస్త్రాలు, మాటివ్వడాలు, మనసు పెట్టడాలు, శుభాకాంక్షలు అన్నీ ఈ పరంధాముని పాదపద్మతీర్ధం వలన పవిత్రములు అవుతున్నాయి; ఈ మహాత్ముడి పాదస్పర్శకు నోచుకున్న ప్రదేశాలు అన్నీ ముక్తిదాయకాలే. అంతటి మహానుభావుడు ఈయన. సనకసనందాది మహామునులు తమ యోగదృష్టితో ఆత్మసాక్షాత్కారం చేసుకోదలచినా గోచరంకాని మంగళమూర్తిని, ఇలా ఈ ఉగ్రసేనాది యాదవులు ఎల్లవేళలా భౌతిక నేత్రాలతో కన్నులారా చూస్తున్నారు. వీరి పుణ్యము ఎంతటిదో? వీరు ఎంత నిష్ఠతో తపస్సు చేసి ఇది పొందారో? ఈ యాదవ పుంగవులు స్వర్గ నరకాలను లెక్కచేయక, ఈలాగున కృష్ణుడిని చూస్తూ కృష్ణుని పొగుడుతూ కృష్ణునితోకలసి ప్రయాణం చేస్తూ కలసి కూర్చుంటూ కలసి శయనిస్తూ సాయుజ్యము పొందినట్లు ఉన్నారు. కృష్ణునితో ఈ బంధుత్వ మిత్రత్వాలు కలిగే భాగ్యం వీరికి ఎలా లభ్యము అయిందో? అని ఆ రాజశ్రేష్ఠులంతా ఆశ్చర్యపడుతూ, శ్రీకృష్ణుడి దయవలన సిద్ధించిన సకల వైభవాలతో జీవిస్తున్న ఉగ్రసేనాది యదు వృష్ణి పుంగవులను ఆ రాజులు అందరూ అనేక సార్లు అభినందించారు. ఆ సమయంలో పాండురాజు పత్ని కుంతీదేవి తన కుమారులకు కౌరవులవలన కలిగిన అపకారాలకు మనస్సులో బాధపడుతూ స్మరించుకుంటుంటే తన అన్నగారు నిర్మలాత్ముడు అయిన వసుదేవుడు కనబడ్డాడు. అన్నయ్యా! పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళూ అయిన పాండవులు కీకారణ్యాలలో భీకరమృగాల మధ్య పలుబాధలు పడతున్నారు. వారిని మీరు దయార్ద్రహృదయంతో చూడాలి కదా. బహు బలవత్తరమైన విధి, ప్రతికూలంగా ఉంటే, ఇంకా బంధువులంటూ ఎవరుంటారులే?” అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు. కుంతీ! నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడ మెందుకు? అన్నింటికీ కర్త ఈశ్వరుడే మాయ అనే తెరవెనుక ఉన్న సూత్రధారి వంటివాడు అయిన ఆయన నడిపిస్తుంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలుబొమ్మలు కనుక విధికి ఎదురీదడం దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి, అడవుల పాలై, నానా అవస్థలూ పడ్డాము. కరుణాసింధు వైన ఈ కృష్ణుడి అనుగ్రహంచేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఇలా ఉన్నాము. అని తన చేలేలైన కుంతిని ఊరడించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడిని చూడాలనే ఆనందంతో నంద యశోదలు, గోపాలురను గోపికలను వెంటబెట్టుకుని వచ్చారు. ఈవిధంగా చాలాకాలం తర్వాత వచ్చిన నందుని వృష్ణి, భోజ, యాదవ ప్రముఖులు అందరూ వరుసగా ఎదురేగి ప్రేమతో పరామర్శించి, కౌగలించుకొని స్వాగతం పలికారు. వసుదేవుడు సంతోషంతో వారికి సముచిత సత్కారాలు చేసాడు. బలరాముడు శ్రీకృష్ణుడు వినయంగా నందయశోదలకు నమస్కరించారు. అలా నందయశోదలకు బలరామకృష్ణులు నమస్కరించిన తరువాత వారిని కౌగలించుకుని నిండుగా స్నేహభావాలు, భక్త్యనురాగాలు పెల్లుబికి కనుల వెంట అనందబాష్పాలు పొంగిపొరలగా మాటలురాక మౌనంగా ఉన్నారు. అంతట, యశోదాదేవి బలరామకృష్ణులను ఒడిలో కుర్చుండపెట్టుకున్నది. వారిని తన గుండెలకు హత్తుకున్నది. చెక్కిలి ముద్దాడింది. చిబుకాలు నిమురుతూ పలుమార్లు కౌగలించుకొని పరమానందం పొందింది. ఆ తరువాత గోపకాంతలు రాకరాక వచ్చిన తమ ప్రాణేశ్వరుడైన శ్రీకృష్ణుడిని చూడాలనే తహతహ ఆనందం హృదయాలలో పొంగిపొరలుతుండగా అక్కడికి చేరారు. పద్మదళాక్షుడు గోపాలుడిని చూస్తున్నంతసేపూ ఆ గోపికలు తమ కళ్ళ రెప్పలను వాల్చలేకపోయారు. వారు కృష్ణుని జగన్మోహన సౌందర్య వైభవాన్ని వర్ణించుకుంటూ, తమ మనసులలో కౌగలించుకుంటూ, బ్రహ్మసాక్షాత్కారం పొందిన యోగులలాగా ఆ గోపస్త్రీలు పరవశించగా వారి తనువులు గగుర్పొడిచాయి. కాంతలతో చక్కని చిరునవ్వులు నవ్వుతూ ఇలా అన్నాడు. కాంతలారా! బలవంతులైన శత్రువులను జయించటానికి వెళ్ళాము. తిరిగిరావడానికి ఆలస్యమైనది. అందుచేత మీరు అంతగా అలుగవద్దు. ఎప్పుడూ గాలికి ఎగురగొట్టబడే దూదిపింజలలాగ, గడ్డిపరకలలాగ చరాచర ప్రపంచం దైవసంకల్పాన్ని అనుసరించి ఒక్కోసారి కలుస్తూ, ఒక్కోసారి విడిపోతూ ఉంటుంది. నాపై భక్తికల మనసులు గలవారికి మోక్షం సులభసాధ్యము, ఆనందదాయకము అవుతుంది. కేవలం జపము, తపస్సు, దానాలు మున్నగు సత్కార్యాలతోటి ముక్తి కలుగదు. శివుడు, బ్రహ్మదేవుడు సనక సనందాదులకు సైతం తమ హృదయాలలో అంకురించని అంతటి గాఢమైన భక్తి మీలో మొలకెత్తింది. మీరు పుర్వజన్మలలో చేసిన సుకృతాల విశేషం పరిపూర్ణంగా ఫలించింది. మీ పుణ్యఫలం వ్యర్థం కాదు. నా యందలి అధికమైన ధ్యానం గల బుద్ధి వలన, ఇక ఎప్పటికీ నరక హేతువులైన జన్మకర్మలు మీకు కలుగవు. సమస్త జీవుల బహిరంతరాల్లోనూ సర్వ కాల సర్వావస్థలలోను నేనుంటాను. సకల ప్రాణుల కార్యకలాపాలకూ పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల సంబంధమే కారణము. ఘటపటాది న్యాయం ప్రకారం వీటిని ఉపాదాన కారణములు అంటారు. అటువంటి పంచభూతాలకూ ఆధారము అయినవాడను నేనే. కనుక నేనే సర్వమునకూ కర్తను. అటువంటి నాకు స్వపరాది తారతమ్యాలు లేవు. నిర్మల హృదయులారా! ఈ విషయంలో ఏ సందేహము కాని, తర్కవితర్కాలు కాని అక్కర లేదు. ఈ విధముగా, శ్రీకృష్ణుడు తన మహత్మ్యాన్ని విశదీకరించగా వినిన గోపికలు వివేకవంతులై దేహాభిమానాలను విసర్జించారు. అచ్యుతుని అనంత గుణాలను కీర్తించారు. తరువాత నందనందనుడు గోపికలు కోరిన ప్రకారం వరాలు అనుగ్రహించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును చూసి, అతనికి నమస్కరించి, “ధర్మరాజా! నీవూ, నీ తమ్ముళ్ళూ, బంధుజనాలూ సత్కర్మ నిరతులై సుఖంగా ఉన్నారా?” అని అడిగాడు. అంతట ధర్మరాజు ప్రీతితో మధుసూదనుడైన శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. మురారి! నీ పాదారవిందాలను ఆశ్రయించినవారు నిత్యసౌఖ్యాలతో అత్యంత సంతుష్టులై ఉంటారు కదా. నీవు జాగ్రత్త, స్వప్న, నిద్రావస్థలు అనే అవస్థాత్రయానికి అతీతుడవు అఖండ జ్ఞానస్వరూపుడవు సకల లోకాలకు అధినాథుడవు సర్వవ్యాపివి విశ్వమే నీవు నీవే విశ్వం ఈ విశ్వమునకు వెలుపల లోపల వ్యాపించి ఉంటావు ఈ విశ్వం నీ యందే నిలచి ఉంటుంది సృష్టి స్థితి లయాలు నీ సంకల్పాధీనాలు యోగమాయ నీకు లోబడి ఉంటుంది పాపదూరులై నిత్యముక్తులైన యోగులు నిను చేరుట కొఱకే ప్రయత్నిస్తారు అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. విధంగా ధర్మరాజు శ్రీకృష్ణుడిని ప్రస్తుతించగా విని అక్కడ ఉన్న రాజులు, బంధు మిత్రులు, సకల జనులు రంజిల్లిన నిండు మనసులతో ఎంతో సంతోషించారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇంకా కొన్ని రోజులలో అరణ్యవాసం ముగుస్తుంది అని తరువాత అజ్ఞాతవాసానికి వెళతామన్ని అందులోకూడా తమకు విజయం దక్కలని తమకు తోడుగా ఉండమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అజ్ఞాతవాసంలో మీకు తోడుగా ఉండలేను కానీ నా అశీస్సులు మీతోనే ఉంటాయి. అరణ్యవాసం లాగానే అజ్ఞాతవాసాని కూడా మీరు విజయవంతంగా పూర్తిచేస్తారు అని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...